చెట్టు నాటితేనే ఇంటికి అనుమతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత తెలంగాణకు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపడుతోంది. కరువు రక్కసిని తరిమివేసే అద్భుత ఆయుధంగా హరతహారాన్ని నమ్ముతోన్న తెలంగాణ సర్కార్, తాజాగా ఓ బృహత్తర నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే మొక్కలు నాటడం తప్పనిసరి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పురపాలక శాఖ , ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. నిన్న వైభవోపేతంగా సాగిన హరితహారం కార్యక్రమంలో ఆయన కూడా పాలుపంచుకున్నారు. కరువుపై సమరానికి హరితహారం మంచి ఆయుధం అని ఆయన అన్నారు. 

హరితహారానికి మరింత బలం చేకూర్చేలా.. పచ్చదనం పెంపొందేలా.. ఇంటి ఆవరణలో గానీ మరో చోట గాని మొక్కనాటి ఆ ఫొటోను సమర్పించిన తర్వాతే ఇంటికి అనుమతినిచ్చే నిబంధన తెస్తామని తెలిపారు. ఇంకుడు గుంతల మాదిరిగానే మొక్కల పెంపకాన్ని తప్పనిసరి చేయాలని ఇప్పటికే చాలామంది కోరుతున్నారని ఆయన వివరించారు. వాతావరణంలో సమతూల్యత దెబ్బ తినడం వల్లనే గతంలో ఎపుడూ లేని విధంగా ఈదురు గాలులు, ఎండలు, రాళ్ళ వానలు వస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకే సీఎం కేసీఆర్ హరితహారం వంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు.