టిజేఎస్, వామపక్షాలపై మావోయిస్టుల విమర్శలు!

డిసెంబరు 7న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ పేరుతో మీడియాకు పంపిన ఒక లేఖలో కాంగ్రెస్‌, తెరాస, టిజేఎస్, బిజెపి, వామపక్షాలతో సహా అన్నీ పార్టీలు కూడా పదవులు,అధికారం కోసమే తాపత్రయపడుతున్నాయి తప్ప దేనికీ ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆసక్తి, చిత్తశుద్ది లేదని ఆరోపించారు. ఈవిషయంలో అన్నీ పార్టీలు ఒకదానికొకటి ఏమాత్రం తీసిపోవని అన్నారు.

గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నేరవేర్చలేకపోయిన సిఎం కేసీఆర్‌, లోక్ సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే, తెరాస ఓడిపోయే ప్రమాదం ఉందనే భయంతోనే 9 నెలలు ముందుగా శాసనసభను రద్దు చేసుకొని ఎన్నికలకు వెళుతున్నారని, ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలాసహకరిస్తున్నారని హరిభూషణ్ ఆరోపించారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ ఈ నాలుగేళ్ళలో తెరాస ప్రభుత్వం వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగయువత తీవ్ర నిరాశకు లోనయ్యారని అన్నారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ విలువలు అంటూ మాట్లాడినా ప్రొఫెసర్ కోదండరామ్ చివరికి కాంగ్రెస్‌ పంచన చేరారని ఎద్దేవా చేశారు.

సిపిఐ, సిపిఎం పార్టీలు తమ పోరాటాలను, విప్లవపంధాను పక్కనబెట్టి పదవులు, అధికారం కోసం అర్రూలు చాస్తున్నాయని హరిభూషణ్ విమర్శించారు. ఈ ఎన్నికలలో ప్రజలు తెరాసను ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినా అవినీతి, దోపిడీ తప్పదని కనుక ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్నా ఈ భూతకాపు ఎన్నికలను ప్రజలందరూ బహిష్కరించాలని హరిభూషణ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.