లైంగిక ఆరోపణల వివాదంలో కేంద్రమంత్రి రాజీనామా

దేశంలో నానాటికీ ఉదృతమవుతున్న మీ-టూ ఉద్యమం ధాటికి మొట్టమొదటి వికెట్ పడింది. అదీ ఒక సీనియర్ కేంద్రమంత్రి ఎం.జె.అక్బర్ కావడం విశేషం. గతంలో ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ప్రియా రమణి అనే ఒక మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. ఆమె ధైర్యంగా బయటకు వచ్చి నోరు విప్పడంతో సుమారు 15-20 మంది మహిళలు కూడా ఎం.జె.అక్బర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

వారి ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, సభ్యసమాజంలో ముఖ్యంగా మంత్రివర్గంలో తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇక విధిలేని పరిస్థితులలో ఆయన ఈరోజు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు.

దాని సారాంశం ఏమిటంటే, ‘నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలను వ్యక్తిగతంగా న్యాయస్థానంలో ఎదుర్కోవాలని భావిస్తున్నందున మంత్రి పదవిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. ఇంతకాలం దేశానికి సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కృతజ్నతలు తెలుపుకొంటున్నాను.’