7.jpg)
రాజకీయాలలో ఎవరు ఎప్పుడు మిత్రులవుతారో...ఎప్పుడు శత్రువులుగా మారుతారో ఎవరూ ఊహించలేరు. అందుకు తాజా ఉదాహరణగా టిడిపి-బిజెపిల శతృత్వం, టిడిపి- కాంగ్రెస్ పార్టీల దోస్తీని చెప్పుకోవచ్చు.
దోస్తులుగా ఉన్నప్పుడు ఒకరినొకరు పొగుడుకోవడం, శత్రువులుగా మారగానే ఒకరి లోపాలు మరొకరు ఎత్తి చూపించుకోవడమూ సహజమే. అయితే భిన్న పరిస్థితులలో వారు మాట్లాడిన విభిన్నమైన మాటలే ఒక్కోసారి ప్రత్యర్ధులకు ఆయుధాలుగా పనికి వస్తాయని మంత్రి కేటీఆర్ నిరూపించారు.
కాంగ్రెస్-టిడిపిల పొత్తులలో నైతికతను ప్రశ్నిస్తున్న తెరాస ఈరోజు మరోసారి కాంగ్రెస్ పార్టీపై మూకుమ్మడి దాడి చేసింది. మంత్రి హరీష్ రావు 12 ప్రశ్నలతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ వ్రాసి నిలదీయగా, ఐటి మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ సామాజిక మాద్యమం ద్వారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
ఒకప్పుడు దుష్ట కాంగ్రెస్ పార్టీ బంధనాల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని, త్వరలోనే సోనియాగాంధీ ఇటలీ పాలన అంతం అవుతుందని బాబు చేసిన వ్యాఖ్యలను, అలాగే ‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణకు వచ్చిందెప్పుడు...వారు తెలంగాణ కోసం చేసిందేమిటి?’ అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను పేర్కొని మరిప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు ఎందుకు సిద్దపడుతున్నారు?అని కేటీఆర్ ప్రశ్నించారు. “అందుకే కాంగ్రెస్-టిడిపిల కూటమిని చెత్త కూటమి అని అంటున్నాము,” అంటూ కేటీఆర్ వరుసగా ట్వీట్స్ చేశారు.