
ఇంతవరకు కేవలం తెరాసపై ఎక్కువ ఫోకస్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, హటాత్తుగా బిజెపిపై బాణాలు ఎక్కుపెట్టారు. ఎందుకంటే, రేపు ఆయన స్వంత నియోజకవర్గమైన కరీంనగర్ పట్టణంలో బిజెపి బహిరంగసభ నిర్వహించబోతోంది. ఆ సభకు డిల్లీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారు. కనుక పొన్నం ప్రభాకర్‌కు కాస్త అసహనం కలగడం సహజమే. అందుకే ఈరోజు తెరాసతో కలిపి బిజెపిపై కూడా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ఏమి చేసిందని దానికి ఓట్లేయాలి? ఈ నాలుగున్నరేళ్ళలో ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమైనా ఒక్క మేలు చేశారా?కనీసం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనైనా అమలుచేయలేకపోయింది. పైగా సిఎం కెసిఆర్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి సహకరిస్తూ రాష్ట్రాభివృద్ధిని దెబ్బ తీసింది. ఈసారి ఎన్నికలలో బిజెపి 100 సీట్లలో పోటీ చేస్తే 100 చోట్ల డిపాజిట్లు కూడా దక్కవు. అందుకే అది తెరాస చెప్పినట్లు ఆడుతోంది. ఎన్నికల తరువాత సిఎం కెసిఆర్ కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించడం ఖాయం. కనుక తెరాసకు ఓటేస్తే బిజెపికి, ప్రధాని మోడీకి ఓట్లేసినట్లేనని ప్రజలు గుర్తుంచుకోవాలి,” అని అన్నారు.