13 మంది కంటి చూపు పోవడానికి కారణం అదేనా!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఘటనపై అధికారులు విచారణ సాగిస్తున్నారు. కంటి చూపు కోసమని వైద్యం చేయించుకుంటే ఇన్ ఫెక్షన్ తో ఏకంగా చూపు కోల్పోయారు 13 మంది రోగులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. నీలోఫర్ ఆస్పత్రిలో వారం క్రితమే సెలైన్ బాటిల్స్ లో ఫంగస్ ను గుర్తించారని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ దవాఖానలకు సరఫరా అయిన కాన్పూర్‌లోని హసీబ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఔషధాలు కలకలం సృష్టిస్తున్నాయి. సరోజినీ దవాఖానలో ఆ సంస్థ సరఫరా చేసిన ఫ్లూయిడ్స్ వల్లనే 13 మంది రోగులు కంటిచూపు కోల్పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కాగా నీలోఫర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు ఆ సెలైన్ బాటిళ్లలో ఫంగస్ ఉందని గుర్తించి.. డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్లు పట్టించుకోలేదని తెలిసింది. రింగర్ ల్యాక్టేట్ (ఆర్‌ఎల్) సెలైన్‌లో బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆ విషయాన్ని నీలోఫర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. జిల్లా డ్రగ్స్ స్టోర్ అధికారులు నీలోఫర్‌కు చేరుకొని హసీబ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన 28వేల సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నారని డాక్టర్ సురేశ్ తెలిపారు. రెండేండ్ల క్రితం కూడా నీలోఫర్ దవాఖానలో గోవా డ్రగ్స్‌కు చెందిన టాసిన్ యాంటిబయోటిక్ ఔషధంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.