తెలంగాణ హరితహారం.. కరువుకు చరమగీతం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు సిఎం కేసీఆర్. కరువు కాటకాలతో అల్లాడే తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనే సుదూర లక్ష్యంతో కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభిస్తున్నారు. అడవుల శాతాన్ని పెంచుకొని.. దాని నుండి వర్షపాతాన్ని రెట్టింపు చేసుకొని కరువును తరిమివెయ్యాలనేది ఆయన లక్ష్యం. 230 కోట్ల మొక్కలు నాటి పెంచడం ద్వారా అడవిలో తెలంగాణ రాష్ట్రం ఉందనిపించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు, ఈ ఏడాది ఈ ఒక్క సీజన్‌లోనే 46 కోట్ల మొక్కలు నాటి కొత్త రికార్డు సృష్టించబోతుంది.

ఈ సీజన్ లో నాటే 46 కోట్ల మొక్కలలో 36.81 కోట్ల మొక్కలు నీడనిచ్చే వేప, మర్రి, రావి లాంటి వున్నాయి. టేకు, మద్ది లాంటి లాభదాయక మొక్కలు మరో 8.5 కోట్లు ఉన్నాయి. పండ్ల మొక్కలు కోటిదాకా ఉన్నాయి. మిగతావి పూలమొక్కలు. చెరువు కట్టలపై పెంచడానికి మరో కోటిదాకా ఈతమొక్కలు కూడా సిద్ధం చేశారు. అటవీ ప్రాంతాల్లోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామికవాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు నాటనున్నారు. హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాఉద్యమంగా చేయాలని సీఎం నిర్ణయించారు

భూభాగంలో 33 శాతం అడవులుండాలని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అడవి సమృద్ధిగా ఉంటేనే సకల జీవరాశి మనుగడ సాగించ గలుగుతుంది. ప్రపంచంలో భారీ స్థాయిలో అడవులున్న 10 దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోని అడవిలో 67శాతం వాటా ఈ పది దేశాలదే. రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, కాంగో, ఇండోనేషియా, సుడాన్ తదితర దేశాల సరసన భారత్ ఉండేది. 1990 వరకు కూడా భారత్‌లో అడవులు బాగానే ఉన్నాయి. దేశంలో 22 శాతం, తెలంగాణలో 24శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉన్నట్లు నిర్ధారించారు. దట్టమైన అడవులతో పాటు జనావాస ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చెట్లు ఉండేవి. రాను రాను పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. జనావాసాలు పెరిగిపోవడం, పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం కోసం అడవిని ఒక వనరుగా ఉపయోగించారు. పోడు వ్యవసాయంతోపాటు గృహ, ఇతర అవసరాల కోసం చెట్లు నరకడం తదితర కారణాల వల్ల అడవులు అంతరించిపోతున్నాయి.