బోనాలకు అంతా సిద్ధం

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. గోల్కొండ దగ్గరి నుండి గండి మైసమ్మ వరకు, చార్మినార్ నుండి ఛాదర్ ఘాట్ వరకు, హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా బోనాలకు సిద్ధమైంది. పోతురాజుల వేషాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర వేడుక బోనాలను జిహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి, టూరిజం డిపార్ట్ మెంట్, ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ ల ఆధ్వర్యంలో 80 కోట్ల ఖర్చుతో నిర్వహించనున్నట్లు హోంమంత్రి నాయిని  నర్సింహారెడ్డి వెల్లడించారు. గతంలోలాగా చందాలు వసూలు చేయడం లేదని.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బోనాల నిర్వహణకు పూనుకుందని హోం మంత్రి నాయిని తెలిపారు. 

బోనాల నిర్వహణకు అవసరమైతే నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాము కోరుతామని నాయిని వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఐదు కోట్ల రూపాయలు కేటాయించారని, అవసరం అయితే వాటిని మరింత పెంచుతామని కూడా ఆయన అన్నారు. ఆ ఏడాది రంజాన్, బోనాలు ఒకేసారి రావడంతో వాటిని ఐక్యమత్యంతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాయిని ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ బోనాల పండగపై వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్షను నిర్వహించింది. బోనాలకు ఎలాంటి లోటు రాకుండా చూస్తామని ప్రభుత్వం వెల్లడిస్తోంది.