తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల కేటాయింపు కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మరోసారి సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కృష్ణా జలాల పంపకాలపై ఎటూ తేలడం లేదు. దాంతో తెలంగాణ సర్కార్ ఈ సారి ఎలాగైనా రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను తీసుకోవాల్సిందే అని పట్టుబడుతోంది. ఇవాళ, రేపు సమావేశమై చర్చించి, తర్వాత మరోసారి 14, 15 తేదీల్లో సమావేశం కావాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది. నదీ పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత ఆధారంగా… ప్రాజెక్టుల వారీగా కేటాయింపులుండాలని తెలంగాణ వాదిస్తోంది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులను వ్య తిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్… మొత్తం నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య మరోసారి నీటి పంపకాలు చేయాలని వాదిస్తోంది.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించాయి. గతంలో కొంత వాదనలు వినిపించిన తెలంగాణ మరోసారి వాదనలు వినిపించేందుకు రెడీ అయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 89వ సెక్షన్ ప్రకారం కృష్ణా జలాలను పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకూ మళ్లీ కేటాయించాలా? లేక కొత్తగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యే పంపిణీ చేయాలా? అనే అంశంపై విచారణ జరుపుతోంది ట్రిబ్యునల్. కృష్ణా జలాల్లో అదనపు వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీల నీటిని పంచుకోవాలి. మరో 77 టీఎంసీల మిగులు జలాలను తెలంగాణకు కేటాయించారు. కానీ న్యాయంగా మరో 150 టీఎంసీలు రావాలని మన రాష్ట్ర సర్కారు చెబుతోంది. ఈ వ్యవహారంతో పాటు తుంగభద్ర జలాల్లో వాటాపైనా బ్రజేష్ ట్రైబ్యునల్ కు వివరించాలనే ఆలోచనలో ఉంది. తుంగభద్ర ఎడమ కాలువ పనులు పూర్తైతే రాష్ట్రానికి 19 టీఎంసీల నీరు అదనంగా వస్తుందని భావిస్తోంది.