హైదరాబాద్ లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి లో వైద్యం వికటించడంతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదమూడు మంది కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఈ పదమూడు మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా ఐదుగురికి ఆపరేషన్ చేస్తే చూపు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ, తాము చేసిన ఆపరేషన్ లో ఎటువంటి పొరపాట్లు జరగలేదని, సెలైన్ బాటిల్ లో ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వైద్యం చేసిన డాక్టర్లు తెలిపారు. క్లేబ్సియెల్లా అనే బ్యాక్టీరియా ఇందుకు కారణం కావచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఇది ఇలా ఉంటే, పేషెంట్స్ వివరణ మరొక విధంగా ఉంది. డాక్టర్లు అస్సలు పట్టించుకోవట్లేదని, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా ఆపరేషన్ చేయడంతో, చూపు మరింత మందగించిందని తెలిపారు. ఈ ఘటన తెలంగాణ లో సంచలనం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే విచారణ జరపాలని ఆదేశించింది.