మొన్న బంగ్లాదేశ్, నిన్న ఇరాక్.. ఇప్పుడు సౌదీ అరేబియా.. ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. మానవ బాంబులై మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. సౌదీలోని 3 నగరాల్లో టెర్రరిస్టులు విధ్వంసం సృష్టించారు. టర్కీ, బంగ్లాదేశ్, ఇరాక్ తర్వాత సౌదీలో పక్కా ప్రణాళిక ప్రకారమే ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరిపారు. సౌదీ పేలుళ్లోనూ ఐఎస్ఐఎస్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థ ఉండే సౌదీ అరేబియాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. మానవ బాంబులై జనం మీద విరుచుకుపడ్డారు. ప్రార్థనలు ముగించుకుని వెళ్తున్న సమయంలో దారుణాలకు ఒడిగట్టారు.
పక్కా ప్లాన్ ప్రకారం వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. సౌదీ అరేబియాలోని ఖతీఫ్ లోని ప్రార్థనా మందిరం దగ్గర ఆత్మాహుతి బాంబు పేలింది. ఈ ఘటనలో సూసైడ్ బాంబర్ మృతదేహం తునాతునకలైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు స్పాట్ లోనే మృతి చెందారు. మరోవైపు మదీనాలోని సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ వద్ద మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలోనూ పలువురికి గాయాలయ్యాయి. జెడ్డాలోని అమెరికా విదేశాంగ కార్యాలయం సమీపంలో సోమవారం ఉదయం ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. నిలువరించే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా, బాంబర్ మాత్రం తనను తాను పేల్చేసుకోవడంతో అక్కడికక్కడే హతమయ్యాడు. యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న ప్రార్థనా మందిరంవైపు వెళ్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఒకే రోజు సౌదీ అరేబియాలోని మూడు వేర్వేరు నగరాల్లో ఉగ్రదాడి జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి.