టాప్ 3లో తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వేగంగా అభివృద్ది ఫలాలు అందుతున్నాయి. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన టీఎస్ఐపాస్ వల్ల పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా టాప్-3లో ఒకటిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని, వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆయన వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తరుణంలో నెలకొని ఉన్న తీవ్ర విద్యుత్ కొరతను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం సమర్థంగా పరిష్కరించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో 24వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి సర్‌ప్లస్ స్టేట్‌గా రూపొందుతామన్నారు. 

ఐటీ రంగంలో ఇప్పటికే దూసుకెళుతున్న రాష్ట్రం ప్రస్తుతం నెంబర్ టూ ప్లేస్ లో ఉందని, త్వరలోనే మంచి ర్యాంక్ సాధిస్తామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరం ఐటీలో బెంగళూరు, పుణె, గుర్గావ్‌లతో కాకుండా ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచం కుగ్రామంగా మారిన తరుణంలో దేశం వరకే పరిమితం కావడం సరికాదన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. ఏరోస్పెస్ రంగంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, ప్రధానంగా ఈ రంగంలోవిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వంద శాతానికి పెంచినందున అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.