ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం చర్చలు సఫలం

సామాన్యుడికి ఆరోగ్య సహాయం చేస్తున్న ఆరోగ్య శ్రీ పై గతకొన్ని రోజులుగా నీలి నీడలు అలుముకున్నాయి. కానీ తాజాగా తెలంగాణ సర్కార్ చర్యలకు పూనుకోవడంతో ఆరోగ్యశ్రీని కొనసాగించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. వెంటనే ఆరోగ్య శ్రీని కొనసాగిస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను విడుదల చేసిందని, మిగిలిన 2వందల కోట్లను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు జరిపిన చర్చల్లో..ప్రభుత్వ హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏడాది కాలంగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటివరకూ ఆగిపోయిన 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వైద్య సేవల బంద్ కాల్ కు ఫుల్ స్టాప్ పడింది.

ఇక మంత్రి లక్ష్మారెడ్డి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రైవేటు ఆసుపత్రులకు నిధులు విడుదల ఆలస్యమైన మాట వాస్తవమేని.. తక్షణమే 117 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల సమస్యలపై పదిరోజుల తరువాత ప్రత్యేక సమావేశం నిర్వహించి..అందులో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. నిధుల చెల్లించే విధానాన్ని ఆధునీకరిస్తామన్నారు లక్ష్మారెడ్డి.