అసెంబ్లీ రద్దు...సస్పెన్స్ కంటిన్యూస్

ఈరోజు ఉదయం 6.45గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని భావిస్తే అది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా పడింది. మధ్యాహ్నం 1.00 నుంచి 1.30 లోపు జరిగే సమావేశంలో అసెంబ్లీ రద్దుపై చర్చించి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఏకవాక్య తీర్మానం ఆమోదించబోతున్నట్లు తాజా సమాచారం. అనంతరం సిఎం కెసిఆర్‌ తన మంత్రులతో కలిసి నేరుగా రాజ్ భవన్ వెళ్ళి గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఆ తీర్మానం ప్రతిని ఆయనకు అందజేస్తారు. అక్కడి నుండి నేరుగా గన్ పార్క్ వెళ్ళి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు ఆర్పిస్తారు. అనంతరం తెలంగాణా భవన్‌ చేరుకొని అక్కడ సిఎం కెసిఆర్‌ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో శాసనసభను ఎందుకు రద్దు చేశారో, ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళబోతున్నారో వివరించబోతున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ మొట్టమొదటి ఎన్నికల ప్రచారసభతో సిఎం కెసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 

టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కెసిఆర్‌ను గవర్నర్ నరసింహన్‌ కోరే అవకాశం ఉంది.