ఉద్రిక్తతలకు దారితీస్తున్న కొత్త జిల్లాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల ప్రకటనతో చాలా చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని డిమాండ్లు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి జిల్లాలోని నాలుగు లేదంటే ఐదు డివిజన్ కేంద్రాలలో ఆందోళన తీవ్రతరమైంది. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలలో  రగడ పీక్స్ కు చేరుకుంది. తెలంగాణలోని రెండో అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నారాయణపేట, వనపర్తిలలో జిల్లాల ఆందోళనలు కొనసాగుతుంటే.. మాజీ మంత్రి డికె అరుణ ఆధ్వర్యంలో గద్వాల్ ను జిల్లా చేయాలని డిమాండ్ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. 

గద్వాల్ ప్రాంతాన్ని శ్రీ జోగులాంబ జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఆందోళనకారులు హైవేపై బైఠాయించారు. మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఈ ఆందోళన కార్యక్రమానికి నేతృత్వం వహించారు. హైవే దిగ్భందంతో హైదరాబాద్ – బెంగుళూరు మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎర్రవల్లి చౌరస్తా కేంద్రంగా హైవేకు ఇరువైపుల కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. హైవే దిగ్భందాన్ని దృష్టిలో ఉంచుకుని 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ హైవే దిగ్భందం ఆగలేదు. గద్వాల కేంద్రంగా శ్రీ జోగులాంబ జిల్లా ప్రకటించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఆందోళన కారులు స్పష్టం చేశారు. ఇందుకు అవసరం అయితే ప్రాణత్యాగాలకైనా వెనుకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరోవైపు, వరంగల్ జిల్లా జనగామలో ఉద్రిక్తత నెలకొంది. జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కొంతమంది ఆందోళనకారులు  స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదుపు తప్పిన ఆందోళనకారులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై నిరసనకారులు భైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.