
నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో 24 గ్రామాలకు చెందిన రైతులు బుధవారం పోచంపాడు ఎస్.ఆర్.ఎస్.పి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ, లక్ష్మీ కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్న ఇంతవరకు అధికారులు ఈ రెండు కాలువలలోకి నీళ్ళు వదలకపోవడం తమ పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు జిల్లాల నుంచి వందల సంఖ్యలో రైతులు తరలివచ్చి ఎస్.ఆర్.ఎస్.పి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ సంగతి తెలుసుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో రైతులు ఆగ్రహంతో కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచరును ధ్వంసం చేశారు. అధికారులు, పోలీసులు వారికి నచ్చజెప్పి అతికష్టం మీద శాంతింపజేశారు.