అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గత కొంత కాలంగా అంతకంతకు పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 49 పైసలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు వెల్లడించాయి. తగ్గించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. తాజా ధరల సవరణతో ఢిల్లీ మార్కెట్లో లీటరు పెట్రోల్ రూ.65.65 నుంచి రూ.64.76కు తగ్గింది. అలాగే డీజిల్ రేటు రూ.55.19 నుంచి రూ.54.70కు జారుకుంది. ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులను బట్టి ఆయా నగరాల్లో ధరల తగ్గుదల రేటు మారుతుంటుంది.
గత రెండు నెలల్లో పెట్రోల్ ధరలు తగ్గడం ఇది మొదటిసారి. మే 1 నుంచి జూన్ 16 మధ్యకాలంలో ఇంధన ధరలు నాలుగుసార్లు పెరిగాయి. నాలుగు దఫాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.4.52 పెరుగగా, డీజిల్ రూ.7.72 మేర ఎగబాకింది. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కాస్త దిగిరావడంతో దేశీయంగానూ పెట్రోల్ ఉత్పత్తుల రేట్లను దిగువ ముఖంగా సవరించేందుకు అవకాశం లభించిందని ఐవోసీ పేర్కొంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత పెట్రోల్ దరలు, డీజిల్ ధరలు తగ్గడంతో సగటుజీవి ఆనందంగా ఉన్నాడు.