
తెలంగాణా ప్రభుత్వం మరో బారీ సంక్షేమ పధకాన్ని అమలుచేయడానికి సిద్దం అవుతోంది. రాష్ట్రంలో విజయ డైరీ, మదర్ డైరీ, కరీంనగర్, ముల్కనూర్ సహకార సంఘాలలో ఉన్న 2.17 లక్షలమంది పాడిరైతులకు ఒక్కొక్కరికీ ఒక పాడిగేదె చొప్పున పంపిణీ చేయడానికి ప్రభుత్వం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అధికారులు వాటి కొనుగోలు చేసేందుకు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళారు. ఒక్కో గేదె ధర రూ.80,000 నుంచి లక్షరూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75శాతం సబ్సీడీపై మిగిలిన వారందరికీ 50శాతం సబ్సీడీపై పాడిగేదెలు పంపిణీ చేయబోతున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం మీడియాకు తెలియజేశారు. వీటికోసం రాష్ట్రప్రభుత్వం రూ. 800 కోట్లు ఖర్చు చేయబోతోందని మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ గేదెల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో వ్యవసాయం తరువాత స్థానంలో పాడిపరిశ్రమ నిలుస్తోంది. కనుక దానిని ఇంకా అభివృద్ధిచేయడం ద్వారా పాడిరైతులకు జీవనోపాధి సృష్టించి వారిద్వారా ఆర్ధికసంపద సృష్టించాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం విజయ డైరీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ నగర పరిధిలో త్వరలో మరో 150 అవుట్ లెట్లు ప్రారంభించబోతున్నాము. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో విజయా డైరీ ఉత్పత్తులనే వినియోగించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాము,” అని అన్నారు.