
రేపు అర్ధరాత్రి నుంచి టిఎస్ఆర్టీసి సమ్మె మోదలవబోతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో హడావుడి మొదలైంది. ఒకపక్క మంత్రుల కమిటీ సమ్మె నివారణకు ఆర్టీసి కార్మిక సంఘాల నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న గవర్నర్ నరసింహన్ ను కలిసి ఆర్టీసి సమ్మె గురించి చర్చించారు. ఈ సందర్భంగా అయన ఆర్టీసిని సమూలంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్లు చెప్పడం విశేషం.
కొందరు స్వార్ధపరులైన కార్మిక నేతల కారణంగా సమ్మె జరుగబోతోందని, దాని వలన ఇప్పటికే బారీ నష్టాలలో ఉన్న ఆర్టీసి ఇంకా నష్టాలలో మునిగిపోయే ప్రమాదం ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. ఆర్టీసిని మళ్ళీ లాభాలబాట పట్టించేందుకు కటినమైన నిర్ణయాలు తీసుకొని సమూల ప్రక్షాళన చేయకతప్పదని సిఎం కెసిఆర్ కెసిఆర్ గవర్నర్ తో అన్నట్లు సమాచారం.
ఆర్టీసిని సమూల ప్రక్షాళన చేయడం అంటే ఏమిటో సిఎం కెసిఆర్ వివరించనప్పటికీ, సమ్మె మొదలైతే ఆయన తీసుకోబోయే నిర్ణయాలతో దానిపై స్పష్టత వస్తుంది. అన్నిటికంటే ముందుగా ఆర్టీసిలో గుర్తింపు పొందిన యూనియన్ తో సహా మిగిలిన యూనియన్లను రద్దు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆవిధంగాచేస్తే ఆర్టీసీలో తెరాస అనుబంధ యూనియన్ ను ప్రతిష్టించడానికే ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఎదుర్కోవలసిరావచ్చు.
ఆర్టీసిని తమకే అప్పగిస్తే దానిని ఏడాదిలోగా లాభాలబాట పట్టించగలమని టి.ఎం.యు అధ్యక్షుడు అశ్వథామ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ కూడా ఆర్టీసిని సమూల ప్రక్షాళన చేసి లాభాలబాట పట్టిస్తానని చెపుతున్నారు. అంటే ఆర్టీసిలో వ్యవస్థాపరమైన లోపాలను చక్కదిద్దితే నేటికీ లాభాలబాట పట్టగలదని స్పష్టం అవుతోంది. కనుక ప్రతీ ఏడాది జీతాలు పెంచవలసి వచ్చినప్పుడు ప్రభుత్వమూ, ఆర్టీసి కార్మిక సంఘాలు ఈవిధంగా ఘర్షణ పడేబదులు ప్రస్తుతానికి ఎంతో కొంత పెంపుకు ఇరుపక్షాలు రాజీపడి ముందుగా ఆర్టీసిని చక్కదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తే అందరికీ మంచిది కదా!