సర్కారీ దవాఖానాలు, సర్కారీ బడులు అంటే ఎలా ఉంటాయో తెలంగాణ జనాలకు బాగా తెలుసు. సర్కారీ బడుల్లో ఎంత బాగా చదువులు చెబుతారో అందులో చదివే పిల్లల తల్లిదండ్రులను అడిగితే చెబుతారు. కానీ ఇదంతా గతం.. ఇప్పుడు సర్కారీ బడుల పరిస్థితి మారింది. మోడల్ స్కూల్స్ తో ప్రైవేట్ దీటుగా పోటీ పడుతున్న తరుణంలో తెలంగాణలోని ఓ పాఠశాల మొదటిసారి ఓ అరుదైన రికార్డుకు శ్రీకారం చుట్టింది. అదే ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ బస్. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం.
సర్కారీ బడుల్లో చదువులే సరిగ్గాలేవు అని చాలా మంది భావించే అదే సర్కారీ బడుల్లో స్కూల్ వెళ్లేందుకు ఏకంగా బస్ ఉంటే ఎలా ఉంటుంది. అచ్చంగా ఇలాగే కరీంనగర్ లో ఓ పాఠశాల చేసిన పని అందరికి షాకిచ్చింది. కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ప్రస్తుతం ఆ స్కూళ్లో ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో బోధిస్తుండగా, 231 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కమలాపూర్, కానిపర్తి, దేశ్రాజ్పల్లి, శంభునిపల్లి, పంగిడిపల్లి, వంగపల్లి గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకునేందుకు వస్తారు. దూరప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ విషయం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి వచ్చింది. స్పందించిన ఆయన రూ.16.30 లక్షలతో పాఠశాలకు బస్సును అందించారు. దీంతో దేశంలోని స్కూల్ బస్ ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాలగా కమలాపూర్ బాయ్స్ హైస్కూల్ రికార్డు నెలకొల్పింది.