నోటిఫికేషన్లే తప్ప ఉద్యోగాలు ఏవి: షబ్బీర్ ఆలీ

జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, తెరాస సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు. విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాలుగేళ్ళలో నోటిఫికేషన్స్..మళ్ళీ రీ-నోటిఫికేషన్స్ ఇవ్వడమే తప్ప ఉద్యోగాలు భర్తీ చేసింది లేదు. సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కెసిఆర్ నీటిని తరలించుకుపోతున్నారు. ఆయనకు ఎవరు ఆ హక్కు ఇచ్చారు? ఒకవేళ వర్షాలు పడకపోతే సింగూరు ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటి? కెసిఆర్ గొప్పగా చెప్పుకొంటున్న రైతుబంధు పధకం వలన రాష్ట్రంలో అర్హులైన పేదరైతులకంటే, భూస్వాములకె ఎక్కువ లబ్ది కలిగింది. అక్కడ మోడీ, ఇక్కడ కెసిఆర్ ఇద్దరూ సమానీ ప్రజల కడుపులు కొట్టి, భూస్వాములకు, కార్పోరేట్ కంపెనీలకు, బడా కాంట్రాక్టర్లకు ప్రజల సొమ్ము దోచి పెడుతున్నారు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే గెలువబోతోంది. రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షలు పంటరుణాలు ఒకేసారి మాఫీ చేస్తాము,” అని అన్నారు.

రాష్ట్రపతి భవన్ లో ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలను రద్దు చేసినందుకు నిరసనగా రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు తాను హాజరుకానని షబ్బీర్ ఆలీ చెప్పారు.