అధికారుల నిర్లక్ష్యం...కార్యాలయంలోనే చెక్కులు భద్రం!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అమలుచేయలనుకుంటుంటే, కొందరు అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా రైతుల పాసుపుస్తకాలలో అనేక తప్పులు దొర్లాయి. ఆ కారణంగా అనేక జిల్లాలలో పాసు పుస్తకాలు, పంటపెట్టుబడి చెక్కులు ఇంకా తహసీల్దార్ కార్యాలయాల బీరువాలలోనే భద్రంగా ఉండిపోయాయి. వానలు మొదలవక మునుపే రైతులందరికీ చెక్కులు అందజేయాలని ప్రభుత్వం నిర్దేశిస్తే, వర్షాలు మొదలవుతున్నా నేటికీ అనేక ప్రాంతాలలో చెక్కులు పంపిణీ మొదలుపెట్టలేదు. 

జోగులాంబ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, బిసి సంక్షేమ శాఖ కమీషనర్ అనితా రాజేంద్ర కలిసి బుధవారం ఖిల్లా గణపురం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు తనికీ చేయగా, రైతుల పాసు పుస్తకాలు, చెక్కులు చాలావరకు కార్యాలయం బీరువాలోనే భద్రంగా ఉండటం చూసి రెవెన్యూ సిబ్బందిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజుగారు ఏడు చేపలు కధలు మాదిరిగా సమగ్ర భూసర్వేలో లోపాల కారణంగా రికార్డులలో తప్పులు...ఆ తప్పులను యధాతధంగా ఆన్-లైన్ లో ఎక్కించిన పాపానికి పాసుపుస్తకాలలో మళ్ళీ తప్పులు...ఆ తప్పుల కారణంగా రైతుబంధు చెక్కుల పంపిణీ చేయలేని పరిస్థితి, ఇన్ని సమస్యలున్నాయని గుర్తించినప్పటికీ వాటిని సరిచేసి రైతులకు చెక్కులు పంపిణీ చేయాలనే స్పృహ ఉద్యోగులలో కొరవడం...ఇలాగ చెప్పుకొంటూపోతే దానికి అంతే ఉండదు. 

ఒక జిల్లాలోని ఒక మండలంలో ఇటువంటి పరిస్థితులు నెలకొనిఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏవిధంగా ఉందో ఊహించలేము. ఇటువంటి సమస్యలు రాకుండా నివారించేందుకే సిఎం కెసిఆర్ తెలంగాణా రైతు సమన్వయ సమితిలను కూడా ఏర్పాటు చేశారు. మరి వారు ఏమి చేస్తున్నారో తెలియదు. 

యుద్ధానికి బయలుదేరినప్పుడు ఒక్క సైన్యాధ్యక్షుడు ఒక్కడికే గెలవాలని కోరిక ఉంటే సరిపోదు, ప్రతీ సైనికుడికి అంతే స్ఫూర్తి, బలమైన కోరిక, పట్టుదల ఉన్నప్పుడే విజయం సాధ్యం అవుతుంది. రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా అటువంటిదే. రైతుల పరిస్థితులు మెరుగుపరచాలని సిఎం కెసిఆర్ ఎంతగా తపిస్తున్నప్పటికీ, దిగువస్థాయి ఉద్యోగులు, నేతలు వరకు అంతే తపనలేకపోతే అయన చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. కనుక రాష్ట్రంలో ప్రతీ ఉద్యోగి, అధికారి, తెరాస నేత, కార్యకర్త తాము సిఎం కెసిఆర్ ఆదేశాలను పాటిస్తున్నామని అనుకోకుండా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకి కూడా దక్కిందని భావించి చిత్తశుద్ధితో పనిచేస్తే చాలు అన్ని పధకాలు తప్పకుండా విజయవంతం అవుతాయి.