తెలంగాణలో టిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. టిఆర్ఎస్ కు తప్ప వేరే పార్టీలకు భవిష్యత్తు లేకుండా చేసేసింది. ప్రతిపక్షానికి చెందిన నాయకులను, ముఖ్య నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ ప్రతిపక్షాలను బలహీనంగా చేశారు. తెలంగాణ తెలుగుదేశంలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వారిలో ప్రస్తుతం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే పార్టీలో ఉండగా, మిగిలిన వాళ్లు మాత్రం టిఆర్ఎస్ లోకి చేరి.. కేసీఆర్ కు జై అన్నారు. అలా కేవలం తెలుగుదేశం అనే కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి కూడా భారీగా చేరికలు జరిగాయి. కాగా టిఆర్ఎస్ తో ఓ ప్రతిపక్షపార్టీ.. అచ్చం ప్రభుత్వంలో ఉన్నట్లే వ్యవహరిస్తోంది.
టిఆర్ఎస్ తో దోస్తీకి తహతహలాడుతున్న ఆ పార్టీ ఎవరంటే.. బిజెపి అనే చెప్పాలి. అవును భారతీయ జనతాపార్టీ ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మజ్లిస్ తో జతకట్టినా కానీ బిజెపి టిఆర్ఎస్ తో జతకట్టాలని ఎందుకు అనుకుంటుంది అనే అనుమానాలు ఎన్నో ఉన్నా.. ముందు నుండి బిజెపి తీరును బట్టి.. ఆ పార్టీ మైండ్ గేమ్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
తెలంగాణ బిజెపిలో అందరి నోట్లో నాలుకలాంటి బండారు దత్తాత్రేయ ముందు నుండి కూడా కేసీఆర్ కు, టిఆర్ఎస్ కు మిత్రుడిగానే ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి దత్తాత్రేయ హాజరవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాజెక్టు మల్లన్న సాగర్ మీద ప్రతిపక్ష పార్టీలు ఏకంగా దీక్షలు, ధర్నాలు, ర్యాలీలకు దిగితే అదే ప్రతిపక్షంలోని బిజెపి మాత్రం ఒక్క స్టేట్ మెంట్ కూడా చెయ్యడం లేదు. ఎన్నికలకు ముందే మతతత్వ బిజెపితో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జతకట్టేది లేదని కేసీఆర్ ప్రకటించారు. మరి బిజెపి మాత్రం అంతలా తాపత్రయపడటానికి కారణం ఏంటి అనుకుంటున్నారా..?
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంతొ పాటుగా కేంద్రంలో బిజెపికి ముందస్తు జాగ్రత్తగా టిఆర్ఎస్ తో మైత్రి కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ స్థానిక పార్టీకి 119 ఎమ్మెల్యేలు, 14 ఎంపీలున్నారు. తొందరలోనే రానున్న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేంద్రానికి బలం కావాలంటే టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు టిఆర్ఎస్ బిజెపిని సపోర్ట్ చేయవచ్చు.. చెయ్యకపోవచ్చు. అందుకే ముందు నుండి బిజెపి టిఆర్ఎస్ తో మైండ్ గేమ్ ప్లాన్ వేసింది. మొత్తానికి బిజెపి టిఆర్ఎస్ ను భలే ట్రాప్ చేస్తోంది.