కౌలు రైతులకు కంచ ఐలయ్య ఉచిత సలహా

కౌలు రైతులకు ప్రభుత్వం పంటపెట్టుబడి సొమ్ము ఇవ్వబోదని సిఎం కెసిఆర్ మళ్ళీ మొన్న తేల్చి చెప్పినందున, కంచ ఐలయ్య వారికి ఒక ఉచిత సలహా ఇచ్చారు. వారు తమ భూస్వాములకు చెల్లించే సొమ్ములో ఆ మేరకు కోసుకొని మిగిలింది ఇవ్వాలని కోరారు. భూస్వాములు కూడా కౌలు రైతుల పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించి అందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి సిఎం కెసిఆర్ చెప్పింది కూడా అదే. భూస్వాములకు ప్రభుత్వం అందిస్తున్న పంటపెట్టుబడి సొమ్మును వారే స్వయంగా కౌలు రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఈరోజుల్లో అంత డబ్బును ఎవరు వదులుకుంటారు?అంత గొప్ప మనసు ఎంతమందికి ఉంటుంది?కనుక రాష్ట్ర ప్రభుత్వమే కౌలు రైతులను ఆదుకునేందుకు తగిన పధకం రూపొందించి అమలుచేస్తే బాగుంటుంది. లేకుంటే వచ్చే ఎన్నికలలో వారి ఆగ్రహాన్ని చవి చూడవలసి రావచ్చు.