సిఎం కెసిఆర్ అందుకు అర్హులు కారట!

ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎల్.ఐ.సి.సంస్థతో ఒప్పందం చేసుకుంది. కనుక నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుల వివరాల నమోదు కార్యక్రమం మొదలవుతుంది. నేటి నుంచి వ్యవసాయశాఖ సిబ్బంది ప్రతీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి రైతుల నామినీ పత్రాలను నింపుతారు. ఆ తరువాత వాటిని ఎల్.ఐ.సి.సంస్థకు అందజేస్తారు. అప్పుడు ఆ సంస్థ రైతుల పేరిట జీవితభీమా సర్టిఫికెట్లను సిద్దం చేసి ఆగస్ట్ 15వ తేదీ నుంచి రైతులకు అందజేస్తుంది. రైతు పధకం కింద రాష్ట్రంలో 42.94 లక్షల మందికి పట్టాదారు పుస్తకాలు, పంట పెట్టుబడి చెక్కులను అందజేసింది. వివిధ కారణాల చేత నేటికీ అనేకమందికి అవి ఇంకా అందలేదు. కనుక ఎవరికైతే ప్రభుత్వం పాసుపుస్తకాలు జారీ చేసిందో వారికి మాత్రమే జీవితభీమా సౌకర్యం కల్పించబోతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ డాక్టర్ జగన్ మోహన్ రావు మీడియాకు తెలిపారు. మిగిలినవారికి కూడా పాసుపుస్తకాలు అందిన తరువాత జీవితభీమా పధకంలో చేర్చుతామని చెప్పారు. 

ఈ పధకంలో జీవితభీమా పొందేందుకు 18 నుంచి 60సం.ల వయోపరిమితి ఉన్నందున, సిఎం కెసిఆర్ దీనికి అర్హులుకారని అయన తెలిపారు. ఎందుకంటే సిఎం కెసిఆర్ వయసు ఇప్పుడు 64సం.లు.