
టిఎస్ఆర్.టి.సి. ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు పెంచడానికి అంగీకరించిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఆర్టీసి నష్టాలలో నడుస్తున్నందున ప్రస్తుత పరిస్థితులలో వేతనసవరణ సాధ్యంకాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి అంత నిర్మొహమాటంగా చెప్పడంతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆందోళన, ఆగ్రహంగా ఉన్నారు. సిఎం కెసిఆర్ మనసు మార్చుకొని తమకు కూడా తప్పకుండా వేతన సవరణ చేస్తారని ఆర్టీసి ఉద్యోగ సంఘాలు గత వారం రోజులుగా ఎదురుచూశాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితులలో సమ్మెకు సిద్దం అవుతున్నారు.
తెలంగాణా మజ్దూర్ యూనియన్ (టి.ఎం.యు.) నేతలు సోమవారం సాయంత్రం ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) శివకుమార్ ను కలిసి జూన్ 11వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించబోతున్నట్లు నోటీసు అందజేశారు. 50 శాతం ఫిట్ మెంట్ తో సహా మొత్తం 72 డిమాండ్లను అయన ముందుంచారు. సమ్మెకు నోటీస్ ఇచ్చినప్పటికీ ఈ నెల 21వరకు వేచి చూస్తామని, అప్పటిలోగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధికసమ్మె ప్రారంభిస్తామని టి.ఎం.యు.నేతలు తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచే సమ్మెకు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తామని టిఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి తెలిపారు.