మాటలతోనే కడుపు నింపుతారా? కోదండరాం

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ నగరంలో తమ పార్టీ నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో తెరాస నియంతృత్వపాలన కారణంగానే తెలంగాణా జనసమితి ఆవిర్భవించింది. తెరాస సర్కార్ తన ఉద్యమ స్పూర్తిని ఎప్పుడో కోల్పోయింది. అధికారంలోకి రాగానే ఫక్తు రాజకీయపార్టీగా మారిపోయింది. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఎప్పుడూ ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధిగా పనిచేస్తోంది. ఈ నేపధ్యంలో ఆవిర్భవించిన తెలంగాణా జనసమితి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ సామాజిక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరచడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెరాస నేతల చేస్తున్న హడావుడి చూస్తుంటే అదేదో తెరాస కార్యక్రమం అన్నట్లుగానే ఉంది తప్ప ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబందించిన పండుగ అని వారు భావిస్తునట్లు లేదు. ఈ నాలుగేళ్ళలో తెరాస సర్కార్ చాలా అబివృద్ధి సాధించామని, అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టామని న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ లో ప్రకటనలు ఇస్తుంటుంది. కానీ వాస్తవానికి వాటిలో ఆచరణలో కనిపించేవి కొన్నే. తెరాసకు ప్రచార యావ ఎక్కువ ఉద్యమస్ఫూర్తి తక్కువ. 

రాష్ట్రం అవినీతి, నిరక్షరాస్యతలలో మొదటిస్థానంలో ఉంది. అలాగే రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా ముందుంది. అన్నిటి గురించి గొప్పగా మాట్లాడే తెరాస నేతలు రైతులు ఆత్మహత్యల గురించి మాత్రం అసలు మాట్లాడరు. ఒకపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే, తమది రైతుబంధు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తెరాస నేతలకే చెల్లు. రూ.4,000 ఇచ్చి దానితో అన్ని సమస్యలు తీరిపోతాయన్నట్లు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ కొద్దిపాటి డబ్బుతోనే రైతుల సమస్యలన్నీ తీరిపోతాయా?” అని ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు.