రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలి: కెసిఆర్

తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ఉదయం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మువ్వన్నెల జెండా ఎగురవేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఈసందర్భంగా రాష్ట్ర పోలీసు దళాల గౌరవవందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా గత నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు, చేపట్టిన అభివృద్ధి పధకాల గురించి వివరించారు. అనేక దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన తెలంగాణాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, రాష్ట్ర ప్రజల జీవనప్రమాణాలు పెంచడమే తన ప్రభుత్వ ఆశయమని సిఎం కెసిఆర్ చెప్పారు.

వ్యవసాయం, సాగునీరు, విద్యా, వైద్య తదితర రంగాలలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, వాటి సత్ఫలితాలను సిఎం కెసిఆర్ తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నప్పటికీ, తమ ప్రభుత్వం అవి సృష్టిస్తున్న అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతోందని సిఎం కెసిఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఇకముందు కూడా ఇదే స్పూర్తి, పట్టుదలతో ముందుకు సాగుతూ అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధిచేసి చూపిస్తామని సిఎం కెసిఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండాలనేది తమ ప్రభుత్వ కోరిక అని అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నామని సిఎం కెసిఆర్ అన్నారు.