
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో ఆదివాసీలకు, లంబాడీలకు మద్య గత కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. దానికి ప్రధానకారణం లంబాడీలను ఎస్.టి.జాబితాలో నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండటమే. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో హసన్ పూర్ లో ఆ రెండు తెగల మద్య జరిగిన ఘర్షణలలో బారీ విద్వంసం జరిగింది. జిల్లా, పోలీస్ అధికారుల చొరవతో రెండు తెగలవారిని తాత్కాలికంగా శాంతింపజేయగలిగారు కానీ లోలోన నిప్పు రగులుతూనే ఉంది.
ఆ ఘర్షణల అనంతరం ఆదివాసీ, లంబాడీ నేతలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. వాటిలో భాగంగా సోమవారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) నేతలతో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్.కెజోషి చర్చలు జరిపారు. వారు యధాప్రకారం లంబాడీలను తక్షణమే ఎస్.టి.జాబితాలో నుంచి తొలగించాలని పట్టుపట్టారు. వారికి ఎస్.కె. జోషి నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవడంతో వారి చర్చలు విఫలం అయ్యాయి. దాంతో నేటి నుంచి ఆదివాసీ తండాలలో ‘స్వయం పాలన’ చేసుకుంటామని ఆదివాసీ సంఘాల నేతలు ప్రకటించారు. నేటి నుంచి లంబాడీ అధికారులు ఎవరినీ తమ ప్రాంతాలలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు తమ ఈ పోరాటం కొనసాగిస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి స్పష్టం చేశారు.