మోత్కుపల్లి రాజకీయ వ్యభిచారి: తెదేపా

తెదేపా నుంచి మోత్కుపల్లి నరసింహులును బహిష్కరించిన తరువాత అయన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై తెదేపా రఘునాధ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చాడ రఘునాథ రెడ్డి ధీటుగా స్పందించారు. మొరపోచంపల్లిలో తన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “తెరాసతో రహస్య ఒప్పందం చేసుకునే మోత్కుపల్లి తెదేపా ప్రతిష్టకు భంగం కలిగించేవిధంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మా పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. తెదేపా జెండా పట్టుకొని తిరిగి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న మోత్కుపల్లి ఇప్పుడు తెరాసకు తొత్తుగా మారి కన్నతల్లివంటి పార్టీకే ద్రోహం తలపెడుతున్నారు.

ఇంతకాలం గవర్నర్ పదవి కోసమే మౌనంగా ఉన్న మోత్కుపల్లి, తెదేపా ఎన్డీయే నుంచి బయటకు రాగానే ఇక తనకు ఆ పదవి లభించే అవకాశంలేదని గ్రహించబట్టే ఒకప్పుడు చంద్రబాబు నాయుడును పొగిడిన అదేనోటితో ఇప్పుడు అనుచితంగా మాట్లాడుతున్నారు. మోత్కుపల్లికి తెరాసలో చేరాలని ఉంటే నిరభ్యంతరంగా చేరవచ్చు కానీ ఈవిధంగా వ్యహవరించడం రాజకీయ వ్యభిచారం చేయడమే. అయన తెదేపాలో ఉన్నప్పుడు పార్టీకి చేసిందేమీ లేదు కనుక పార్టీని వీదిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు,” అని అన్నారు.