
రాష్ట్రమంతటా అన్ని జిల్లాలోను రైతులకు కొత్తపాసు పుస్తకాలను, రైతుబంధు చెక్కులను అందిస్తుంటే పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపురం మండలం, కూనారం గ్రామంలో ఇంతవరకు ఒక్క పాసు పుస్తకం, చెక్కును కూడా ఇవ్వకపోవడం విశేషం.
ఆ గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూములు, పట్టా భూములు, అటవీ భూములు ఉన్నాయి. అవికాక దేశ్ ముఖ్ లకు చెందిన సీలింగ్ భూములు కూడా ఉన్నాయి. అవి దాదాపు 2,000 ఎకరాల వరకు ఉన్నాయని అధికారులు లెక్క కట్టారు. గత 50 ఏళ్ళలో ఆ వివాదాస్పదమైన భూములు అనేక చేతులు మారాయి. అలాగే ఆ గ్రామంలో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఇటీవల జరిపిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఈ సంగతి బయటపడటంతో అధికారులు ఆ భూములన్నిటినీ అటువంటి వాటికోసం నిర్దేశించిన ‘పార్ట్-డి’ అనే ప్రత్యేక సెక్షన్ లో పెట్టారు.
అయితే కూనారం గ్రామంలో మిగిలిన 3,900 ఎకరాల భూములలో ఎటువంటి వివాదాలు లేవని అధికారులే నిర్దారించారు. కనుక సదరు రైతుల పేరిట 961 పాసు పుస్తకాలను, వాటికి రైతుబంధు చెక్కులను కూడా సిద్దం చేశారు. కానీ వాటిని పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తే గ్రామంలో వివాదాస్పద భూములలో సాగు చేసుకొంటున్న మిగిలిన రైతుల ఆగ్రహానికి గురి కావలసివస్తుందనే భయంతో ఇంతవరకు ఎవరికీ కొత్తపాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయలేదు. దాంతో గ్రామంలో రైతులందరిలో ఆందోళన నెలకొని ఉంది.
వివాదాలున్న భూములను గుర్తించడం బాగానే ఉంది కానీ ఆ కారణంగా మిగిలిన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములపై తమకు యాజమాన్యపు హక్కు లేకుండా పోతుందేమోనని భయపడుతున్నారు. మా యాజమాన్యపు హక్కులను దృవీకరిస్తూ తక్షణమే కొత్త పాసుపుస్తకాలను ఇవ్వాలని రైతులు పంచాయితీ కార్యాలయం చుటూ తిరుగుతున్నారు. మరి వారి గోడు ఎవరు ఆలకిస్తారో? ఎప్పటికి ఈ సమస్య పరిష్కరిస్తారో చూడాలి.