జూలై నెలాఖరులోగా ఎన్నికలు?

తెలంగాణాలో పంచాయితీల పదవీకాలం జూలై 1వ తేదీతో ముగుస్తుంది కనుక అంతకంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ ఓటర్ల జాబితా సిద్దం కాకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేకపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నాగిరెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్లు, పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వారితో పంచాయితీ ఎన్నికల నిర్వహణ గురించి చర్చించారు. ఎట్టి పరిస్థితులలోను జూలై నెలాఖరులోగా పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ముగించవలసి ఉంటుందని కనుక తదనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు గాను పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిజిపి ఎం.మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా అందుకు తాము సిద్దంగా ఉన్నామని అయన తెలిపారు.

పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ, ఇప్పటికే బిసి ఓటర్ల జాబితా దాదాపు సిద్దం అయ్యిందని జూన్ మొదటివారంలోగా బిసి ఓటర్ల తుది జాబితాను అందజేస్తామని చెప్పారు. ఈ ఎన్నికలలో మొత్తం సుమారు 1.5 కోట్లు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని చెప్పారు. 

కనుక త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అర్ధం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయితీ ఎన్నికలను అన్ని పార్టీలు సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి. కనుక వీటిలో గెలిచి తమ సత్తా చాటుకోవాలని అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి.