లక్నవరం ఎప్పుడైనా చూశారా?మన తెలంగాణాలోనే ఉంది!

విదేశాలలో అందమైన లోకేషన్స్ ను సినిమాలలో చూస్తున్నప్పుడు, జీవితంలో ఒక్కసారైనా అక్కడకు వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది? అని అనిపిస్తుంది. కానీ సగటు భారతీయులు ఎవరూ తమ జీవితకాలంలో అక్కడకు వెళ్ళలేరు. ఆర్ధిక పరిమితులు కారణంగా కనీసం దేశంలో ఇతర రాష్ట్రాలలో పర్యాటక ప్రాంతాలను కూడా చూడలేనివారు కోకొల్లలు ఉన్నారు. అటువంటివారికి తెలంగాణా రాష్ట్రంలోనె అనేక అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయనే సంగతి తెలిస్తే చాలా సంతోషిస్తారు.       

హైదరాబాద్ నగరానికి 150 కిమీ దూరంలో, అదే..వరంగల్ నగరానికైతే 75కిమీ దూరంలో లక్నవరం గ్రామం ఉంది. అక్కడ సుమారు 10,000 ఎకరాలలో విస్తరించి ఉన్న స్వచ్చమైన మంచినీటి సరస్సు ఉంది. దాని పేరు లక్నవరం సరస్సు. దాని మద్యలో 13 చిన్న చిన్న దీవులున్నాయి. ఆ ద్వీపాలలో పచ్చటి చెట్లు..ఆ చెట్లపై పక్షులు కిలకిలారావాలు..చుట్టూ కనుచూపుమేర సముద్రాన్ని తలపించేవిధంగా నీళ్ళు..ఆ నీటిపై నుంచి వీచే చల్లటి గాలులు.. ఆ ప్రకృతి సోయగాలు ఎవరి మనసులనైనా రంజింపజేస్తాయి. 

లక్నవరం చెరువును..మద్యలో ఉన్న దీవులను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఒడ్డు నుంచి ఆ ఒక దీవిని కలుపుతూ ఒక సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించింది. అప్పటి నుంచి హైదరాబాద్ తో సహా రాష్ట్రం నలుమూలల నుంచి రోజూ బారీ సంఖ్యలో పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఆ ద్వీపాలలో రాత్రిపూట కూడా బస చేసేందుకు వీలుగా కాటేజీలు, రెస్టారెంట్లు కూడా నిర్మిస్తోంది. నానాటికీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో, ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జికి సమాంతరంగా మరొక దానిని కూడా నిర్మించాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. ఆ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, ఇంతకు ముందు సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించిన మంగళూరుకు చెందిన ఆర్కిటెక్ట్ భరద్వాజ కలిసి మంగళవారం లక్నవరంలో పర్యటించారు. రూ.5 కోట్లు వ్యయంతో మరో బ్రిడ్జిని నిర్మించదానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు మొదలుపెట్టబోతున్నట్లు మీడియాకు తెలియజేశారు. త్వరలోనే పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్లు, కాటేజీల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని తెలిపారు.