సమ్మెలే..సమ్మెలు

ప్రస్తుతం రాష్ట్రంలో సమ్మెల సీజన్ మొదలైనట్లుంది. వేతన సవరణ చేయాలని 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు నేడు, రేపు సమ్మె చేస్తున్నారు. హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో చేరిన అరుణ అనే ఒక మహిళ మరణానికి కారకుడని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఒక జూనియర్ డాక్టర్ ను నిన్న చితకబాదారు. అందుకు నిరసనగా నీమ్స్ జూనియర్ డాక్టర్లు నేడు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వాసుపత్రులలో మెడికోలకు వైద్యపాఠాలు భోదించే ప్రొఫెసర్లకు (సీనియర్ వైద్యులకు) పదవీ విరమణ వయసును 58సం.ల నుంచి ఒకేసారి 65సం.లకు పెంచడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు 5 రోజులపాటు సామూహిక శలవు పెట్టి  నిరసన తెలియజేస్తున్నారు. సీనియర్ వైద్యుల పదవీ విరమణ వయసును పెంచితే తాము నష్టపోతామని వాదిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్వయం ఉపసంహరించుకోకపోతే జూన్ 2వ తేదీ నుంచి నిరవదిక సమ్మె చేయడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. 

ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ చేసి సిఎం కెసిఆర్ వారిపై ప్రశంశలు వర్షం కురిపించి, తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే వారు ఒకసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద లేబర్ కమీషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. జూన్ 6వ తేదీలోగా సిఎం కెసిఆర్ తమ డిమాండ్లకు అంగీకరించకపోతే నిరవదిక సమ్మె చేయడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. 

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల సమయంలో సిఎం కెసిఆర్, ఎంపి కవిత ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు అమలుచేయనందుకు సింగరేణి కార్మికులు కూడా గుర్రుగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో రైతులు నిత్యం ఎక్కడో అక్కడ గిట్టుబాటు ధరల కోసం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనో లేదా తమ పాసుపుస్తకాలలో తప్పులు దొర్లినందుకో రోడ్ల మీదకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కనుక ప్రస్తుతం రాష్ట్రంలో సమ్మెల సీజన్ మొదలైనట్లు కనిపిస్తోంది.