అలాగైతే జీతాలు ఇవ్వడం ఆపేయాలి: కెసిఆర్

సిఎం కెసిఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో తెలంగాణా రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి వచ్చేందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు రూ.2 లక్షలు చొప్పున పంటరుణాలు మాఫీ చేస్తామని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. 

రాష్ట్రానికి ప్రతీ నెల అన్ని రకాల ఆదాయాలు కలుపుకొని రూ.10,500 కోట్లు ఆదాయం వస్తోంది. దానిలో రూ.2,000 కోట్లు మన ప్రమేయం లేకుండానే అప్పులు, వడ్డీల నిమిత్తం కేంద్రం కోసేసుకొంటుంది. ఇక ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సీడీల కోసం రూ.6,000 కోట్లు ఖర్చు ఉంటుంది. కనుక మిగిలిన రూ.2,500 కోట్లతోనే ప్రభుత్వం నడిపించవలసి ఉంటుంది. 

ఈ పరిస్థితులలో రైతులకు రూ.2 లక్షలు పంటరుణాలు మాఫీ చేయాలంటే ఓ 20 నెలలపాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నడిపించాలి. ఇది సాధ్యమేనా?మరి కాంగ్రెస్ నేతలు ఏవిధంగా రూ.2 లక్షలు పంటరుణాలు ఒకే విడతలో మాఫీచేస్తామని హామీ ఇస్తున్నారో వారే చెప్పాలి. ప్రజలను ప్రలోభపెట్టి అధికారంలోకి వచ్చేందుకే వారు ఆచరణ సాధ్యంకాని ఇటువంటి హామీలు ఇస్తున్నారు. ఈసారి రూ.2 లక్షలు పంటరుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తే, ఏవిధంగా దానిని అమలుచేస్తారని ప్రజలే వారిని నిలదీసి అగడాలి,” అని అన్నారు.