
తెలంగాణా భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో మరెక్కడా జరుగనివిధంగా మూడు నెలలో రాష్ట్రంలో సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన చేశామని సిఎం కెసిఆర్ గొప్పలు చెప్పుకున్నారు. కానీ అదొక ప్రహసనంగా మారింది. రైతులకు పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలలో అన్నీ తప్పులే ఉన్నాయి. రాజీవ్ రహదారిపై నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ వాటి నివారణకు తెరాస సర్కార్ ఏమి చేసింది?అంటే ఏమీ లేదనే చెప్పాలి. కాంగ్రెస్- తెరాసలు నాణేనికి బొమ్మా బొరుసువంటివి. దొందూ దొందే. రెండింటి పాలనలో తేడా ఏమీ లేదనే చెప్పాలి.
కొత్త జోనల్ వ్యవస్థను హడావుడిగా ఏర్పాటు చేసేసాక, దానిని అమలుచేయలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరమని గ్రహించి హడావుడిగా డిల్లీ వెళ్ళారు. కానీ డిల్లీ వెళ్తే ఆయనకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ విదేశీయాత్రలకు బయలుదేరుతున్న సమయంలో కెసిఆర్ డిల్లీ వెళ్ళడం చేతనే ఆయనకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. నిజానికి భాజపా నేతలమైన మాకంటే ఆయనకే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు మేము సిఎం కెసిఆర్ ను గత నాలుగేళ్ళుగా అపాయింట్మెంట్ కోరుతున్నాము. కానీ అయన ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు?” అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రంలో 10,000 మందిని కలిసి సర్వే చేసి, భాజపా, మోడీ పాలన గురించి అభిప్రాయాలు సేకరించి తమ అధిష్టానానికి ఆ నివేదిక సమర్పిస్తామని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఈనెల 31న హైదరాబాద్ లో మేధావుల సమ్మేళనం నిర్వహిస్తామని లక్ష్మణ్ చెప్పారు.