
తెదేపా ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మోత్కుపల్లి నరసింహులు, పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగేవిదంగా, తీవ్ర అప్రదిష్ట కలిగేవిదంగా మాట్లాడుతున్నందుకు ఆయన సోమవారం పార్టీ నుంచి బహిష్కరింపబడ్డారు. ఊహించినట్లుగానే ఆ ప్రకటనపై మోత్కుపల్లి మండిపడుతూ, ఈరోజు హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.
“పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి పార్టీ జెండా ఎత్తుకుపోయిన దొంగ చంద్రబాబు నాయుడు. అయన మిత్రద్రోహి. నమ్మినవారిని ముంచడం అయనకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికలలో తెదేపాకు మద్దతు పలికి పార్టీ తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ను అధికారంలోకి వచ్చిన తరువాత పులిహోరలో కరివేపాకులా టీసి పక్కన పడేశారు. ఇప్పుడు నన్ను పక్కన పడేశారు. చంద్రబాబు దుర్మార్గుడని తెలిసికూడా నేను అయన కోసం నా జీవితాన్ని ధారపోశాను.
చంద్రబాబు జీవితంలో అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలే. అయన తన వైఫల్యాలను, అవినీతిని, అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి కులాల మద్య చిచ్చుపెట్టడానికి వెనకాడటం లేదు. తిరుమలలో బ్రాహ్మణులకీ- బ్రాహ్మణులకీ మద్య, ఏపిలో కాపులకీ-కాపులకీ-బీసీలకి మద్య గొడవలు పెట్టారు.
ఇక్కడ రెండు బిల్డింగులు, అక్కడో రెండు బిల్డింగులు కట్టించి హైదరాబాద్, అమరావతిని నేనే డెవలప్ చేశానని చంద్రబాబుగొప్పలు చెప్పుకొంటున్నారు. ఏపి ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే నాలుగేళ్ళు ఏమి పీకారు?
ప్రత్యేకహోదా వద్దన్నది ఆయనే. ప్యాకేజీ ముద్దన్నదీ ఆయనే. ఆ తరువాత ఇప్పుడు ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే ముద్దు అంటున్నదీ ఆయనే. ఇలాగ రోజుకొక మాట మాట్లాడుతూ నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, తన వైఫల్యాలను, అసమర్ధతను కప్పిపుచ్చుకొని, ఆ తప్పులను కేంద్రం తోసేయడానికి ఇంతకాలం ఏ భాజపాను ప్రధాని నరేంద్ర మోడీని పొగిడారో ఇప్పుడు వారినే నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. అది కేవలం చంద్రబాబుకే సాధ్యం.
ఎవరైనా దళితుడిగా పుట్టాలని కోరుకుంటారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించి దళితులంటే తనకు చాలా చులకనభావం ఉందని మరోసారి నిరూపించుకున్నారు. ఏపిలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో ప్రజలు తగినవిధంగా బుద్ధి చెప్పాలని కోరుకొంటున్నాను. ముఖ్యంగా బిసిలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తెదేపాను ఓడించి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పాలని కోరుకొంటున్నాను.
జగన్ కేసులు పైకి కనిపిస్తున్నాయి కనుక అతనిని అవినీతిపరుడని నిందించ గలుగుతున్నారు. కానీ చంద్రబాబు, లోకేష్ కలిసి చేస్తున్న చీకటిలో చేస్తున్న అవినీతి పైకి కనబడదు. వారిరివురూ సంపాదిస్తున్న అక్రమ సంపాదనలను దుబాయ్, సింగపూర్ లో దాచుకొంటున్నారు.
రాష్ట్రం కోసం 29 సార్లు మోడీ చుట్టూ తిరిగానని చంద్రబాబు చెప్పు కోవడం సిగ్గు చేటు. నిజానికి అయన తనపై ఉన్న కేసులలో నుంచి బయటపడేందుకె అన్నిసార్లు డిల్లీ వెళ్లివచ్చారు. ఆయనకు నిజంగా ఏపికి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలుకావాలని కోరుకుంటే, తన ముఖ్యమంత్రి పదవికి, తన ఎంపిలు పదవులకి రాజీనామాలు చేసి ఉండి ఉంటే ఎప్పుడో వచ్చేది కదా!
వచ్చే ఎన్నికలలో ఏపి ప్రజలు ఎవరిని గెలిపించుకున్నా పరువాలేదు కానీ చంద్రబాబు నాయుడుని మాత్రం తప్పకుండా ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బాబు ఓడిపోవాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకొంటున్నాను,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడును ఉద్దేశ్యించి మోత్కుపల్లి ఇంకా చాలా అనుచితమైన పదాలు వాడారు. అవన్నీ అనవసరం. చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకు ఎంత గొప్ప అభిప్రాయం ఉందో ఈరోజు తేలిపోయింది. చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి అని తెలిసి మరిన్నేళ్ళు ఎందుకు అయన వెంటే ఉన్నారు? గవర్నర్ పదవి కోసమే కదా? అనే ప్రశ్నకు నేనెప్పుడు పదవుల కోసం వెంపర్లాడలేదు,” అని అన్నారు.