వారి రాజీనామాలు ఆమోదం ఇంకా ఎప్పుడో?

ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా ఆ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియగానే తమ రాజీనామా పత్రాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు స్వయంగా సమర్పించారు. ఏప్రిల్ 6న వారు రాజీనామాలు సమర్పిస్తే ఇంతవరకు వాటిని ఆమోదింపజేసుకోలేదు. స్పీకర్ కూడా వాటిని ఆమోదించకుండా పక్కన పెట్టేశారు. 

వైకాపా, భాజపాలు దగ్గరవుతున్న కారణంగానే స్పీకర్ వాటిని ఆమోదించలేదని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఏపి రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పదవులకు రాజీనామాలు చేశామని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా ఎంపిలు ఇంతవరకు ఎందుకు వాటిని ఆమోదింపజేసుకోలేదు? నేటికీ ఎంపిలుగా కొనసాగుతూ జీతభత్యాలు, ప్రోటోకాల్ సౌకర్యాలు ఎందుకు అనుభవిస్తున్నారు? ఇది రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం కాదా? అని చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు నిలదీస్తున్నారు. బహుశః అందుకే వారు తమ త్యాగాల (రాజీనామాల) గురించి గొప్పగా చెప్పుకోలేకపోతున్నారేమో?

ఈ రాజీనామాల సీరియల్ లో నేడు తరువాత ఎపిసోడ్ మొదలవబోతోంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం ఆ ఐదుగురు వైకాపా ఎంపిలతో మాట్లాడి రాజీనామాలపై వారి ఉద్దేశ్యం తెలుసుకోబోతున్నారు. ఆ తరువాత ఆమె వాటిపై ఒక నిర్ణయం తీసుకుంటారు.

దీనిపై తెదేపా సీనియర్ నేత ఏపి రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, “భాజపా-వైకాపాల మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే ఇంతకాలం వారి రాజీనామాలను ఆమోదించకుండా తాత్సారం చేశారు. ఇప్పుడైనా వాటిని వెంటనే ఆమోదిస్తారనే నమ్మకం లేదు. వాటిని ఆమోదించినా నోటిఫై చేయడానికి సమయం పడుతుంది కనుక ఆ ఐదు స్థానాలలో ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇదంతా భాజపా-వైకాపాలు ఒక పధకం ప్రకారం కలిసి ఆడుతున్న నాటకమే తప్ప మరొకటి కాదు. రాజీనామాల డ్రామాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న వైకాపాకు ప్రజలే తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.