
కర్ణాటక సిఎం కుమారస్వామి ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, “ఆరున్నర కోట్లమంది కన్నడ ప్రజలు మా పార్టీని తిరస్కరించారని చెప్పడానికి నేనేమి సిగ్గుపడను. కనుక నేను ప్రజల దయతో సిఎంని కాలేదు. కాంగ్రెస్ (దయ)వలనే సిఎం కాగలిగాను. కనుక విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాంగ్రెస్ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.
అయితే ఎన్నికల సమయంలో పంటరుణాల మాఫీతో సహా మా పార్టీ ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ఉంటాము. పంటరుణాల మాఫీ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలోనే కాంగ్రెస్ పార్టీతో చర్చించిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటాము. ఒకవేళ పంట రుణాలను మాఫీ చేయలేని పరిస్థితే ఎదురైతే నేను నా పదవికి రాజీనామా చేస్తాను.
మూడు రోజులలోగా పంట రుణాలు మాఫీ చేయకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని ఎడ్యూరప్ప మా ప్రభుత్వాన్ని హెచ్చరించడం సరికాదు. నిజానికి అయన హయంలోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని అందరికీ తెలుసు, రైతుల కోసం ఇప్పుడు అయన మొసలి కన్నీళ్ళు కారుస్తూ ఆందోళనలు చేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు.