కోమటిరెడ్డికి కెసిఆర్ శుభాకాంక్షలు!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాళ్ళ ఒక ఊహించని వ్యక్తి నుంచి లేఖ అందింది. అది ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ. ఇవాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదినశుభాకాంక్షలు తెలియజేస్తూ సిఎం కెసిఆర్ స్వయంగా సంతకం చేసి లేఖ పంపారు. ఆ లేఖలో “మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను,” అని తెలుగులో టైప్ చేయబడి ఉంది.


ఆ లేఖను అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు జన్మదినశుభాకాంక్షలు తెలియజేసినందుకు సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ లేఖలో తనను ఎమ్మెల్యేగా గుర్తించినందుకు చాలా సంతోషమని కానీ ప్రోటోకాల్ ప్రకారం తనకు భద్రత, ఇతర సౌకర్యాలు ఎందుకు పునరుద్దరించలేదని ప్రశ్నించారు. 

శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదటిరోజున ఉభయసభలను ఉద్దేశ్యించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణతో స్పీకర్ మధుసూధనాఛారి వారిరువురి శాసనసభ్యత్వాలు రద్దు చేశారు. వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ నేటి వరకు వారిరువురి శాసనసభ్యత్వాలను స్పీకర్ పునరుద్దరించలేదు. విచిత్రమేమిటంటే, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు ఎవరూ ఇప్పుడు వారి సభ్యత్వాలను పునరుద్దరించాలని గట్టిగా పట్టుబట్టడం లేదు. ఈ వ్యవహరంపై ప్రభుత్వం కూడా మౌనం వహించింది. కనుక వారిరువురూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారో లేదో చెప్పలేని పరిస్థితి. కానీ సిఎం కెసిఆర్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు క్రింద ఎమ్మెల్యే, (నల్లగొండ నియోజక వర్గం) అని స్పష్టంగా వ్రాసి ఉంది కనుక వారిరువురిని ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం గుర్తించింది అనుకోవాలేమో?