పంచాయితీ ఎన్నికలకు టిజెఎస్, బిఎల్ఎఫ్ సై!

రాష్ట్రంలో పంచాయితీల పదవీకాలం ఆగస్ట్ 1 తో ముగియబోతోంది కనుక జూన్ నెలాఖరు లేదా జూలై మొదటివారం లోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. బహుశః త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చు.

సాధారణ పరిస్థితులలో ఈ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ మరొక ఏడాదిలోపుగానే సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నందున, కొత్తగా ఏర్పడిన తెలంగాణా జనసమితి (టిజెఎస్), బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) ఈ ఎన్నికలలో తమ సత్తాను పరీక్షించి చూసుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గ్రామాలలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెరాస సర్కార్ రైతువ్యతిరేక విధానాలు అవలంభిస్తోందనే అయన వాదనలతో రైతులు ఏకీభవిస్తారో లేదో ఈ ఎన్నికలలో తేలిపోతుంది. 

రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని భావిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర చేసిన తరువాత, సిపిఎం నేతృత్వంలో బిఎల్ఎఫ్ కూటమిని ఏర్పాటుచేశారు. కనుక బిఎల్ఎఫ్ సత్తా ఏపాటిదో ఈ ఎన్నికలలో తేలిపోవచ్చు. 

ఇక రాష్ట్రంలో తెరాస సర్కార్ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిశబ్ద విప్లవం మొదలైందని చెప్పుకొంటున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదన నిజమో కాదో ఈ ఎన్నికలలోనే తేలిపోవచ్చు. అలాగే వచ్చే ఎన్నికలలో 106 సీట్లు సాధిస్తామని తెరాస చాలా నమ్మకంగా చెప్పుకొంటోంది. దాని మాటలు ఎంతవరకు నిజమో ఈ పంచాయితీ ఎన్నికలలో తేలిపోవచ్చు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం రద్దుతో ఉపఎన్నికలు వస్తే వాటిలో ప్రతిపక్షాలకు తన సత్తా చాటిచూపాలని తెరాస అనుకొంది. కానీ న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో అది వీలుపడలేదు. కనుక పంచాయితీ ఎన్నికలలో తెరాసతో సహా అన్ని పార్టీలు తమ సత్తా చాటుకోవడానికి గట్టిగా ప్రయత్నించవచ్చు. కనుక త్వరలో జరుగబోయే పంచాయితీ ఎన్నికలను 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించవచ్చు. వాటి ఫలితాలను బట్టి 2019 ఎన్నికలలో ఏ పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో ఊహించవచ్చు.