గుడ్ లక్ టు కర్ణాటక: కెసిఆర్

కర్ణాటక ముఖ్యమంత్రి నేడు కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనను అభినందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు పోచారం, లక్ష్మారెడ్డి, కొందరు తెరాస నేతలు,ఎంపిలు,ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని మంగళవారం సాయంత్రం బెంగళూరు వెళ్ళారు. వారికి కుమారస్వామి బృందం ఘనంగా స్వాగతం పలికింది. సిఎం కెసిఆర్ బృందం కుమారస్వామి, దేవగౌడలకు అభినందనలు తెలియజేశారు. 

అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ, “సరిగ్గా నెలరోజుల క్రితమే కర్ణాటకలో జెడిఎస్ అధికారంలోకి రాబోతోందని చెప్పి వెళ్ళాను. నేను చెప్పినట్లుగానే జెడిఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా కుమారస్వామికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు నేను హైదరాబాద్ లో అత్యవసర సమావేశాలలో పాల్గొనవలసి ఉంది కనుక కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను. అందుకే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒకరోజు ముందుగానే వచ్చాను. మళ్ళీ వీలుచూసుకొని మరోసారి తప్పకుండా వస్తాను. ఈ ఎన్నికల ద్వారా ప్రాంతీయ పార్టీల సత్తా మరోసారి నిరూపితమైంది. ఇకముందు కూడా దేశంలో ప్రాంతీయపార్టీలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. గుడ్ లక్ టు కర్ణాటక,” అని అన్నారు. తరువాత సిఎం కెసిఆర్ బృందం మళ్ళీ నిన్న రాత్రే హైదరాబాద్ తిరిగిచేరుకుంది.