12 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నా: కేసీఆర్

గతంలో తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం మైనార్టీలకు కల్పిస్తానని మాటిచ్చిన 12 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ సిఎం కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన మాట ప్రకారం 12 శాతం రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నానని, తాను మాట ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతానని అందరికి తెలుసు అని అన్నారు.  మైనార్టీల రిజర్వేషన్ల కోసం కమిటీ నియమించామని, కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాన్ని ఢిల్లీకి పంపుతామని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం తనకుందని కూడా ఆయన అన్నారు.

రంజాన్ దీక్షలో భాగంగా ఆదివారం రాష్ట్రంలోని 200 మసీదుల వద్ద ప్రభుత్వపరంగా దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఏర్పాటు చేశామని, లక్షల సంఖ్యలో ముస్లింలు ఈ విందులో పాల్గొనడం చాలా సంతోషకరం అని కేసీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల సంక్షేమానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు కేటాయించిందంటే అది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. షాదీ ముబారక్ వంటి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింల సంక్షేమానికి అత్యధిక నిధులను తాము కేటాయిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముస్లింల విద్యాభివృద్ధికి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 120 రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.