ఎడ్యూరప్పకు సుప్రీం దెబ్బ

కర్ణాటక ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన ఎడ్యూరప్పకు 24 గంటలలోనే ఎదురు దెబ్బ తగిలింది. శనివారం సాయంత్రం 4గంటలకు శాసనసభలో బలనిరూపణ చేసుకోవలసిందిగా ఎడ్యూరప్పను సుప్రీం కోర్టు ఆదేశించింది. 

ఎడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుచేయవలసిందిగా గవర్నర్ ఆహ్వానించగానే, ఎడ్యూరప్పను ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ బుధవారం అర్ధరాత్రి సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే మంజూర్ చేయడానికి నిరాకరించినప్పటికీ ఈరోజు ఉదయం 10.30గంటలకు దానిపై విచారణ చేపట్టి తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపింది. 

ఈరోజు ఉదయం ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత, ఎడ్యూరప్పను శనివారం సాయంత్రం 4గంటలకు శాసనసభలో బలనిరూపణ చేసుకోవలసిందిగా ఆదేశించింది. ఎడ్యూరప్ప తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. కానీ ఆ ఎమ్మెల్యేల పేర్లను పేర్కొనలేదు. ఎడ్యూరప్ప లేఖ ఆధారంగా గవర్నర్ ఆయనకు అవకాశం కల్పించి, గురువారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. గవర్నర్ నిర్ణయంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ 'గవర్నర్ అధికారాలను తాము ప్రశ్నించలేమని చెపుతూనే, అందరూ ప్రజాతీర్పును గౌరవించాలని చెప్పి సున్నితంగా చురక వేసింది. 

రాజకీయ సంక్షోభం నెలకొని ఉన్న ఇటువంటి సమయంలో గవర్నర్ వజుభాయ్ వాలా తన విచక్షణాధికారాలను ఉపయోగించుకొని వినిశ్ నెరో అనే ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను శాసనసభకు నామినేట్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది. తాత్కాలిక శాసనసభ స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించవచ్చు కానీ నామినేటడ్ ఎమ్మెల్యేను పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇక బలపరీక్షను సోమవారం వరకు గడువు ఇవ్వాలని, రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలనే భాజపా న్యాయవాది అభ్యర్ధనలను కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ద్వందంగా తిరస్కరించింది. శనివారం సాయంత్రం 4గంటలకు బలపరీక్ష నిర్వహించాలని, దానిలో పాల్గొనే శాసనసభ్యులు అందరూ చేతులు ఎత్తి మద్దతు తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.       

కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ కు తరలించాయి కనుక రేపటిలోగా వారిని ప్రలోభపెట్టి లేదా భయపెట్టి లొంగదీసుకోవడం చాలా కష్టమే. కనుక ఎడ్యూరప్ప ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ లా మిగిలిపోతారా లేక కేంద్రప్రభుత్వం పూనుకొని ఏదోవిధంగా ఆయనను ఒడ్డున పడేస్తుందా..చూడాలి.

తాజా సమాచారం: ఈరోజు జెడిఎస్ అధినేత దేవగౌడ జన్మదినం కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు!