గులాబీ కారులో నేతలు డిష్యుం డిష్యూం!

ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గంలో పెదమునగల గ్రామంలో బుధవారం రైతుబంధు చెక్కుల పంపిణీ సందర్భంగా తెరాస ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గీయులు ఒకరినొకరు కొట్టుకొనేవరకు వెళ్ళారు. కార్యక్రమం మొదలయ్యాక మొదట ఎమ్మెల్యే మదన్ లాల్ మాట్లాడారు. ఆ తరువాత ఎంపి పొంగులేటి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశం మేరకు అధికారులు చెక్కుల పంపిణీకి సిద్దం అవుతుంటే, ఎంపి అనుచరుడు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోసూరి శ్రీను వేదిక మీదకు వచ్చి మైక్ లో ఏదో మాట్లాడబోయారు. అక్కడే ఉన్న ఎంపి అనుచరులు అయన చేతిలో నుంచి బలవంతంగా మైక్ లాక్కోవడంతో ఇరువర్గాల మద్య కాసేపు త్రోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే మదన్ లాల్ తన కారువైపు వెళుతుండగా ఈసారి ఎంపి అనుచరులు ఆయనను అడ్డుకొన్నారు. దాంతో మళ్ళీ ఇరువర్గాల మద్య కాసేపు త్రోపులాటలు జరిగాయి. పోలీసులు మళ్ళీ కలుగజేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎంపి, ఎమ్మెల్యేల సమక్షంలోనే వారి అనుచరులు కొట్టుకోవడానికి సిద్దపడినప్పుడు వారిని వారించకపోవడం గమనిస్తే వారిరువురి మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయని స్పష్టమవుతోంది.