1.jpg)
వేతనసవరణ విషయంలో ఆర్టీసి ఉద్యోగులకు, రాష్ట్రప్రభుత్వానికి మద్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్టీసి ఎప్పుడూ నష్టాలలోనే కొనసాగుతున్నప్పటికీ, తెలంగాణా ఏర్పడిన తరువాత ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానంగా 44 శాతం ఫిట్ మెంట్ ప్రకటించామని సిఎం కెసిఆర్ అన్నారు. ఏటా రూ.750 కోట్లు నష్టాలు మూటగట్టుకొంటున్న ఆర్టీసిని కాపాడేందుకు తమ ప్రభుత్వం రూ.3,400 కోట్లు కేటాయించిందని అన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికుల, వారిపైనే ఆధారపడిన వారి కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసి పట్ల తమ ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంటే, జీతాలు పెంచకపోతే సమ్మె చేస్తామని బెదిరిస్తూ ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా?అని సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసిని మూసుకోవాలనుకొంటే నిరభ్యంతరంగా సమ్మె చేసుకోవచ్చని సిఎం కెసిఆర్ అన్నారు.
ముఖ్యమంత్రినైన నన్నే అధికారులు తప్పు దోవపట్టించారని, అందుకే నేను వేతనసవరణకు అంగీకరించడంలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపించడంపై సిఎం కెసిఆర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై వేలాది ఆటోలు, టాక్సీలు, బైకులు తిరుగుతునందున బారీగా నష్టపోతున్న ఆర్టీసీని ఏవిధంగా కాపాడుకోవాలా అని నేను రోజంతా అధికారులు, మంత్రులతో చర్చలు జరిపితే, ఆర్టీసీ కార్మికసంఘాలు నన్నే తప్పుపడతాయా? అని సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, కేరళవంటి రాష్ట్రాలలో అసలు ఆర్టీసీ సంస్థలే లేవని, కానీ తెలంగాణాలో ఆర్టీసీ నష్టాలతో నడుస్తున్నప్పటికీ దానిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే కార్మికసంఘాల నేతలు సమ్మె చేస్తామని బెదిరిస్తున్నారని సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ జీతల పెంపు విషయంపై మంత్రివర్గ సబ్ కమిటీ చర్చించి నివేదిక సమర్పిస్తుందని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకొంటానని, కార్మిక సంఘాలు అంతవరకు ఓపికపట్టాలని సిఎం కెసిఆర్ సూచించారు. కాదని సమ్మె చేస్తే చివరికి ఆర్టీసీ సంస్థ, దాని కార్మికులు, ఉద్యోగులే మునుగుతారని గుర్తుంచుకోవాలని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.