
ప్రభుత్వోద్యోగులు, ఉపాద్యాయుల డిమాండ్లన్నిటికీ అంగీకారం తెలిపి, వారిపై ప్రశంశల వర్షం కురిపించిన సిఎం కెసిఆర్, ఆర్టీసీ ఉద్యోగులపట్ల మాత్రం కటువుగా వ్యవహరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గం సబ్ కమిటీతో చర్చలలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, కార్మిక సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తమ డిమాండ్లపై మంత్రివర్గం సబ్ కమిటీ సానుకూలంగా స్పందించినప్పటికీ టి.ఎం.యు.గౌరవధ్యక్షుడైన హరీష్ రావు మాత్రం మౌనం వహించడాన్ని కూడా ఆర్టీసీ ఉద్యోగాసంఘల నేతలు తప్పుపట్టారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం, పెట్రోల్, డీజిల్, టైర్లు, బస్సు విడిభాగాల ధరలు పెరిగిపోవడం, గతంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించవలసిరావడం వంటి అనేక కారణాల చేత ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోతుంటే, కార్మికుల పనితీరు సరిగా లేనందునే ఆర్టీసీ నష్టపోతోందని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి కెసిఆర్ ను తప్పు దోవపట్టించారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి మాటలు విని సిఎం కెసిఆర్ తమపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆర్టీసిని మూసేయలనుకొంటే సమ్మె చేసుకోండని హెచ్చరించడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తప్పు పట్టారు. అలాగే జీతాలు పెంచమని అడిగితే ఇతర రాష్ట్రాలతో పోల్చి టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామని సిఎం కెసిఆర్ చెప్పడాన్ని కూడా వారు తప్పు పట్టారు. నష్టాల బూచిని చూపి వేతన సవరణ చేయకుండా ప్రభుత్వం తప్పించుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వేతన సవరణ చేయలేమనుకొంటే కనీసం ఇంటీరియం రిలీఫ్ గా 25 శాతం పెంపును ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే సమ్మెచేయక తప్పదని కానీ ఆ పరిస్థితి రాకూడదని కోరుకొంటున్నామని హెచ్చరించారు.