
ముఖ్యమంత్రి కెసిఆర్-ప్రభుత్వోద్యోగులు, ఉపాద్యాయుల సంఘాల నేతల మద్య బుధవారం ప్రగతి భవన్ లో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లకు సిఎం కెసిఆర్ అంగీకరించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న మా ఉద్యోగులకు జీతాలు పెంచడం నా బాధ్యత. వారందరూ ఎంతో నిజాయితీగా, రేయింబవళ్ళు కష్టపడి పనిస్తుండటం వలననే ఇంత తక్కువ కాలంలో తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాలలో దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలువగలిగింది. కనుక వారు కోరినట్లుగానే జీతభత్యాలు పెంచుతాము. బదిలీలను చేపడతాము. అలాగే కారుణ్య నియామకాలు, ఫిట్ మెంట్, మధ్యంతర భృతి, డెత్ కర్ణాటక గ్రాట్యూటి బెనిఫిట్స్ వగైరాలను అందిస్తాము,” అని సిఎం కెసిఆర్ అన్నారు.
క్లుప్తంగా ఆ వివరాలు:
1. తక్షణమే డిఏ మంజూరు. జూలై నెలాఖరులోగా రెండవ విడత డిఏ మంజూరు.
2. ఈ శనివారంలోగా పి.ఆర్.సి. ప్రకటన.
3. ఆగస్ట్ 15న ఫిట్ మెంట్ ప్రకటన.
4. జూన్ 2న ఎల్టీసి ప్రకటన (ఎల్టీసి పొందేందుకు బిల్లులు సమర్పించనవసరం లేదు).
5. జూన్ 15లోగా బదిలీల ప్రక్రియ పూర్తి.
6. బదిలీలకు శాశ్వత విధానం
7. విధివిధానాలను రూపొందించడానికి అజయ్‌మిశ్రా కమిటీ
8. బదిలీల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
9. ఉద్యోగాలు చేసే భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్.
10. రెండేళ్ళు సర్వీసు పూర్తిచేసుకొన్నవారు పదోన్నతికి అర్హులు.
11. మహిళా ఉద్యోగులకు 5 రోజులు ప్రత్యేక శలవులు మంజూరు.
12. సిపిఎస్ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యూటి.
13. ఉద్యోగి చనిపోతే 10 రోజులలోగా కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ.
14. రాష్ట్రంలో 4 జోన్లు ఏర్పాటు. దానిపై చర్చల బాధ్యత దేవీశ్రీ ప్రసాద్ కు అప్పగింత.
15. క్యాబినెట్ సబ్‌కమిటీ కొనసాగింపు.
16. ఉద్యోగ విరమణ రోజునే అన్ని బెనిఫిట్లు.