కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మమతా స్పందన

దేశవ్యాప్తంగా అందరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం చాలా ఉత్కంఠతో ఎదురుచూశారు. వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఒకరు. ఇంతవరకు వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి ఆమె కూడా స్పందించారు. “ఈ ఎన్నికలలో విజయం సాధిస్తున్నవారికి అభినందనలు. అలాగే ఓడిపోయినవారు మళ్ళీ పోరాడేందుకు సిద్దపడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జెడిఎస్ తో ముందే ఎన్నికల పొత్తులు కుదుర్చుకొని ఉండి ఉంటే ఫలితాలు మరో విధంగా వచ్చి ఉండేవి,” అని ట్వీట్ చేశారు. 

ఈ విషయంలో ఆమె చేసిన సూచన సహేతుకంగానే ఉంది. కానీ అదేసమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నానని చెప్పకనే చెప్పినట్లయింది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా సిఎం కెసిఆర్ ఏర్పాటు చేయాలనుకొంటున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మొట్టమొదట ఆమెతోనే చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతానని ఆమె నిర్దిష్టంగా ఎటువంటి హామీ, ప్రకటన చేయనప్పటికీ తప్పకుండా చేరుతారనే అభిప్రాయం కలిగించారు. కానీ ఆమె ఫెడరల్ ఫ్రంట్ ఆశయానికి విరుద్దంగా కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపుతూ ట్వీట్ చేశారు. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ, ఫెడరల్ ఫ్రంట్ లలో దేనినో ఒక దానిని ఎంచుకోవలసి వస్తే కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపే అవకాశం ఉందని భావించవచ్చు.