
టి-కాంగ్రెస్ నేతలు మూడవ విడత ప్రజాచైతన్య యాత్రను ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్ రైతుబంధువని తెరాస నేతలు గొప్పగా ప్రచారం చేసుకొంటున్నారు. మరి రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు పధకం ఎందుకు వర్తింపజేయలేదు? గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారని తెలిసి ఉన్నా వారిని ఎందుకు ఆదుకోవడం లేదు? నాలుగేళ్ళు రైతుల ఘోడు పట్టించుకోని సిఎం కెసిఆర్, వచ్చే ఎన్నికలలో రైతుల ఓట్ల కోసమే ఈ రైతుబంధు పధకం ప్రవేశపెట్టారు తప్ప రైతులకు ఏదో మేలు చేయాలని కాదు. ఈ నాలుగేళ్ళలోనే రాష్ట్రంలో 3,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు...ఎందుకు? వారి మరణాలకు ఎవరు బాధ్యులు? వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదు? ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వారు రోడ్డున పడుతున్నారు. పేద రైతన్నలను ఆదుకోలేని రైతుబంధునని చెప్పుకోవడం సిగ్గుచేటు. పైగా సిఎం కెసిఆర్ తన స్వంత ప్రచారం కోసం రైతుబంధు పధకం పేరుతో ఇతర రాష్ట్రాలలో పేపర్ ప్రకటనలు ఇచ్చుకొంటున్నారు. దాని కోసం వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. దీని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు ఏవిధంగాను సహాయపడని సిఎం కెసిఆర్ ఏవిధంగా రైతుబంధువు అయ్యారు?” అని ప్రశ్నించారు.
“సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఎన్నిటిని నెరవేర్చారంటే ప్రభుత్వం నుంచి సమాధానం ఉండదు. అందరికీ మాయమాటలు చెపుతూ మభ్యపెడుతూ సిఎం కెసిఆర్ కాలక్షేపం చేసేస్తున్నారు. ఇదివరకు మా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నిర్మించినవాటిని కూడా తనే కట్టించానని సిఎం కెసిఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారు. తెరాస సర్కార్ పతనం ఎప్పుడో ప్రారంభం అయ్యింది. 2019 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలే తెరాసకు తగినవిధంగా బుద్ధి చెపుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అన్ని వర్గాల ప్రజలను ఆదుకొంటాము,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.